సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్ఓ పసుపులేటి రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. ఆయన డ్రిగీ వరకు చదువుకున్నారు. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. మొదట విశాలాంధ్ర, తర్వాత జ్యోతిచిత్ర పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేసారు. ప్రస్తుతం సంతోషం సినీ పత్రిక తరపున పనిచేస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. ఇప్పటి తరం హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలతో పాటు 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూలు చేశారు. వీటిలో ఎంపిక చేసిన కొన్నింటిని నాటి మేటి సినీ ఆణిముత్యాలు అనే పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. పసుపులేటి రామారావు మరణం పట్ల తెలుగు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.
తనకు ఎంతో ఆత్మీయుడైన రామారావు మరణం పట్ల చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని అన్నారు. ‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికి నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.