ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రావి కొండలరావు 1932, ఫిబ్రవరి 11 న ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టు మాస్టరు ఉద్యోగ విరమణ అనంతరం శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులందరూ శ్రీకాకుళం వాసులు కావడంతో అక్కడ స్థిరపడ్డారు. 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కు పైగా సినిమాలలో నటించారు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. రావి కొండలరావు సతీమణి ప్రముఖ నటి రాధాకుమారి. వీరిద్దరూ కలిసి జంటగా చాలా సినిమాల్లో నటించారు. 2012 లో రాధాకుమారి మృతి చెందారు. తేనె మనసులు, దసరా బుల్లోడు, రంగూన్ రౌడీ, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, భైరవ ద్వీపం, రాధాగోపాలం వంటి చిత్రాల్లో నటించారు రావి కొండలరావు.
రావికొండలరావుకు ఆంధ్రా విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. కాకినాడలో పాఠశాలవిద్యాభ్యాసం చేసిన ఆయన 1958లో సినీ ప్రస్థానం మొదలైంది. మద్రాసులోని ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. పొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో స్టోరీ విభాగంలో పనిచేశారు. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో తొలిసారి సినిమాలో నటించారు. రాధాకుమారితో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి తమిళ చిత్రాలకు డబ్బింగ్ చెప్పేవారు. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాలకు పర్యవేక్షక నిర్మాతగానూ వ్యవహరించారు. భైరవ ద్వీపం, బృందావనం సినిమాలకు మాటల రచయితగా, పెళ్లి పుస్తకం సినిమాకు కథా రచయితగా చేశారు. రావి కొండలరావు రచనలు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి. హాస్య రచయితగానూ గుర్తింపు పొందారు. సుకుమార్ అనే కలం పేరుతో 60 వరకు రచనలు చేశారు రావికొండలరావు.