తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆయన భార్య మీడియాకు వెల్లడించారు.
నర్సింగ్ యాదవ్ విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించారు. గత 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నర్సింగ్ యాదవ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్షణ క్షణం, గాయం లాంటి సినిమాల్లో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లోని దాదాపు 125 సినిమాలకు పైగా నటించారు. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’లోనూ నటించారు నర్సింగ్ యాదవ్.