ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కాంట్రవర్సీలకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఎక్కడో ఓ చోట ఇరుక్కుంటూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మరోసారి కోట ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. తెలుగు ఇండస్ట్రీపైనే కాకుండా దర్శకులపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. ఈ మధ్య అసలు కోట సినిమాల్లో కనిపించడం లేదు. కనీసం ఈయనకు అవకాశాలు కూడా ఇవ్వడం లేదు దర్శకులు.
పూర్తిగా ఆయన్ని కాదని పక్కన పెట్టేసారు. ఇదే ఇప్పుడు ఈయనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. గత 30 ఏళ్లుగా రోజుకు 20 గంటలు పని చేస్తూ వచ్చిన ఈయనకు ఇప్పుడు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చడం లేదు. ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పాడు ఈ సీనియర్ నటుడు. తనను ఎందుకు పట్టించుకోవడం లేదో.. అసలెందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తనకు కూడా అర్థం కావడం లేదంటున్నాడు. తనకు వయసు అయిపోయిందని.. ఇక నడవలేడని ముందే నిర్ణయించుకుని తనను పక్కనబెట్టేసారేమో అంటున్నాడు.
తను ఇప్పటికీ బాగానే ఉన్నానని.. కాళ్ళ నొప్పులు మాత్రమే ఉన్నాయంటున్నాడు ఈయన. ఈ మాత్రం దానికే తనను పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తారని అనుకోలేదని చెబుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కనీసం వేషాలు ఇవ్వండ్రా నాయనా అంటూ కొందరు దర్శకులను తాను అడుగుతున్నట్లు చెప్పాడు. తనకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నచ్చడం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నానని.. తప్పుగా అనుకోవద్దు అని అంటున్నాడు.
గతంలో కూడా కోట ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ముఖ్యంగా మా అసోషియేషన్ ఎన్నికలు పూర్తైన తర్వాత అధ్యక్ష పదవి కార్యక్రమంలో కోట చేసిన కామెంట్స్ ఇప్పటికీ సంచలనమే. నెలలో 12 రోజులైనా మన నటులకు వేషాలు దొరికేలా చేస్తే కృష్ణానగర్ దగ్గర ఎంతోమంది జీవితాలకు కాస్త అన్నం దొరుకుతుందని చెప్పాడు కోట. అంతేకానీ ఎక్కడ్నుంచో పరభాషా నటులను విమానాల్లో తీసుకొచ్చి.. వాళ్లకు లక్షలకు లక్షలు ఇచ్చి.. ఏసీ రూమ్స్ బుక్ చేసి వాళ్ల ఆస్తులు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు.
తెలుగులో తెలుగు వాళ్లను ప్రోత్సహించకపోవడం కంటే దారుణం మరోటి లేదంటున్నాడు. ఈ విషయంపై ఎప్పట్నుంచో ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇదే విషయం ఇప్పుడు మరోసారి గుర్తు చేసాడు. మా ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్త వర్గమైనా ఏదైనా చేయాలంటూ ఆయన కోరాడు. తాను సామి అనే తమిళ సినిమాలో విలన్ వేషం వేయడానికి వెళ్లినపుడు కనీసం రూమ్స్ కూడా ఇవ్వలేదని.. ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నాడు కోట. కానీ మనం మాత్రం పరభాషా నటులకు సర్వం సమకూర్చి మరీ ఆస్తులు కూడబెట్టేలా చేస్తున్నామని విమర్శించాడు కోట. ఈయన వ్యాఖ్యలు ఈ దర్శకులకు అర్ధం చేసుకుంటారో లేదో!