సీనియర్ నటుడు గిరిబాబు ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. అందులోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గిరిబాబు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన దుస్థితికి కారణం మాత్రం ఆయన దురదృష్టమేనని చెప్పారు. అప్పుడు తాము చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని.. మేము ఎంపీలు, ఎమ్మెల్యేలం కాదని.. కేవలం పార్టీ సభ్యులం మాత్రమే అని తెలిపారు. రాజకీయ పరిణామం వాళ్ల బంధువర్గంలోనే జరిగిపోయింది.. అంత వెలుగు వెలిగిన మహానుభావుడు చివరకు అంత దారుణమైన స్థితికి పడిపోవడం మాత్రం ఎప్పటికీ బాధ కలిగించే విషయం అన్నారు.
టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆరే కరెక్ట్ అని అంటున్నారు గిరిబాబు. పార్టీ ముందున్న ఏకైక లక్ష్యం జూనియర్ ఎన్టీఆరేనని అన్నారు. అతడిని పార్టీలోకి తీసుకురాకుంటే టీడీపీ బతికి బట్టకట్టడం కష్టమని అన్నారు.
బాలకృష్ణ తనను అన్నయ్య అని పిలిచేవాడని గిరిబాబు అన్నారు. ఆయన కోపం గురించి తనకు బాగా తెలుసని అన్నారు. బాలయ్యకు కోపం ఎక్కువే గానీ అందరినీ సెట్లో కొడతాడు అనేది మాత్రం అబద్ధం.. విసిగిస్తే ఎవరికైనా కోపం వస్తుంది.. బాలయ్యది కూడా అలాంటి కోపమే అన్నారు. ఎన్టీఆర్ బతికున్నపుడు తెలుగుదేశం పార్టీలో పని చేశానని.. ఇప్పుడు వైసీపీలో ఉన్నానని 2009లోనే రాజశేఖర్ రెడ్డి వైపు వచ్చానని.. ఇపుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నానంటున్నారు సీనియర్ నటుడు గిరిబాబు.