టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాలో నటనకు ఆయనను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. మొత్తంగా రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు.
తన కెరీర్ లో 932 సినిమాలు చేసిన చంద్రమోహన్.. అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించారు. కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి కొత్తతరాన్నీ ఆకట్టుకున్నారు. చంద్రమోహన మృతిపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.