ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. ఈ దంపతులకి ముగ్గురు మగసంతానం.
ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా… గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా… వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు.
చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈయన 290కి పైగా చిత్రాల్లో నటించారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? తదితర ధారావాహికల్లో నటుడిగా మెప్పించారు.