టీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి రాజీనామా లేఖలు సమర్పించారు. రామగుండం నియోజవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో సత్యనారాయణ పరాజయం చవిచూశారు. అప్పటి నుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను అడగకుండానే సీఎం గతంలో నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. కానీ, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే కారణమని దుయ్యబట్టారు.