కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా షూటింగ్‌లతో స్టార్లు బిజీ అయిపోయారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాజాచిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగాషూటింగ్ పూర్తి చేసుకుంది. విశాఖలో తాజా షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పరశురాం వెల్లడించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి, భీమిలి బీచ్, అరకులోయ తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విశాఖ సినిమా షూటింగ్‌లకు ఎంతో అనుకూలమని అన్నారు.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విలన్ రోల్ చేస్తున్నట్లుగా ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అర్జున్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు మహేష్ కూడా భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.