భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీ ఆడబోతోంది. ఇందుకోసం ఇప్పటికే జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టేసింది. తల్లి కావడంతో ఆటకు తాత్కాలికంగా దూరమైన సానియా..వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సానియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కష్టపడి 4 నెలల్లో 26 కేజీల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. ఏకాగ్రత, శ్రమ, నిబద్ధత కారణంగానే ఇది సాధ్యమైందంటోంది.
‘నా బరువు గురించి ఇప్పటికే చాలా మంది ప్రశ్నించారు. బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని అడుగుతున్నారు. నేను నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 23 కేజీలు తగ్గాలని ధ్యేయంగా పెట్టుకున్నాను. కానీ, 26 కేజీల బరువు తగ్గించుకోగలిగాను. శ్రమ, క్రమశిక్షణ వల్లనే ఇది సాధ్యమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంత బరువు తగ్గడం మామూలు విషయం కాదని చాలా మంది నాకు సందేశాలు పంపుతున్నారు. మహిళలూ..మీకో మాట చెప్పదలుచుకున్నాను. నేనే సాధించాను అంటే అది మీకు కూడా సాధ్యమవుతుందని అర్థం. రోజుకు ఒకటి లేదా రెండు గంటలకు జిమ్‌లో కష్టపడండి. మీరే అద్భుతాలు చూస్తారు’ అని రాసుకొచ్చి వీడియో షేర్ చేసింది. సానియా మీర్జా చివరిగా 2017లో చైనా ఓపెన్‌లో భారత్ తరఫున ఆడింది.