ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నాట్యం’. ఆమె స్వీయ నిర్మాణంలో రేవంత్ కోరుకొండ డైరెక్షన్‌లో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రం నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ: నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ప్రాణం. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. రంగ ప్రవేశం చేసేందుకై కాదంబరి నాట్యం చేయాలనుకుంటుంది. దానికి గురువుగారు ఒప్పుకోరు. ఆ నాట్యం అభ్యసించడానికి ఎవరు ముందుకు వచ్చిన చనిపోతుంటారు. అయినప్పటికీ సితార తన రంగ ప్రవేశానికి ఆ నాట్యమే చేస్తానని పట్టుబడుతుంది.
తరువాత సిటీలో ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) మంచి వెస్ట్రన్ డ్యాన్సర్. అతను ఓ పనిపై నాట్యం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సితారతో పరిచయం ఏర్పడుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఆమె చేసిన ఓ పని.. గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తుంది. దీంతో సితార ఆ గ్రామం విడిచి సిటీకి వెళ్తుంది. ఆ తర్వాత సితార జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమె చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన నెరవేరిందా లేదా? అసలు కాదంబరి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేదే కథలోని అంశం.
నటీనటులు:కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నటన పరంగా పర్వాలేదనిపించుకున్నా.. డాన్స్ విషయంలో మాత్రం విజృంభించింది. ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో మెప్పించారు. శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు.
విశ్లేషణ: టాలీవుడ్‌లో నాట్యప్రధానమైన సినిమాలు అప్పట్లో బాగానే వచ్చేవి. ఆ సినిమాలను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. కాగా ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసినప్పటికీ.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి.
అలాగే సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ కూడా లేవు. పస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండాఫ్ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
టైటిల్ : నాట్యం
నటీనటులు :సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు
నిర్మాత : సంధ్యారాజు
దర్శకత్వం: రేవంత్ కోరుకొండ
సంగీతం : శ్రవణ్ బరద్వాజ్
హైలైట్స్: చివరి 20 నిమిషాలు
డ్రాబ్యాక్స్: సాగదీత సన్నివేశాలు
చివరిగా: పెద్దగా ఆకట్టుకోలేని ‘నాట్యం’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)