“అ… ఆ” రివ్యూ
నటీనటులు:
సమంతా, నితిన్, అనుపమ పరమేశ్వరన్, నదియా, అనన్య, ఈశ్వరి రావు, సన, నరేష్, రావురమేష్, అజయ్, పోసాని, శ్రీనివాసరెడ్డి, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, గిరిబాబు, ప్రవీణ్ తదితరులు..
సాంకేతికవర్గం:
సినిమాటోగ్రఫి: నటరాజన్ సుబ్రమణియన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు, ఆర్ట్: ఏ.యస్ ప్రకాష్, సంగీతం: మిక్కీ జె. మేయర్, సమర్పణ: శ్రీమతి మమత, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నిర్మాత: యస్.రాధాకృష్ణ, స్టొరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్:త్రివి క్రమ్
విడుదల తేది: జూన్ 2, 2016
స్లోపాయిజన్ రేటింగ్: 2.75/5
కథ:
“అత్తారింటికి దారేది” చిత్రంతో చాలా దగ్గరి పోలికలు గల సినిమా “అ.. ఆ”. అనసూయ రామలింగం-ఆనద్ విహారి… ఇద్దరూ బావామరదళ్ళు. తల్లి చూపించే మితి మీరిన ప్రేమ, ఆమె పెట్టె అలవి కాని ఆంక్షలు తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్యా ప్రయత్నం సైతం చేసిన అనసూయ (సమంతా)… తల్లి (నదియ) బిజినెస్ టూర్ మీద వెళ్ళినప్పుడు.. తండ్రి (నరేష్) ప్రోత్సాహంతో తన మేనమామ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు ఉంటుంది. అప్పటికే అదే ఊరికి చెందిన రావు రమేష్ కూతురు అనుపమ పరమేశ్వరన్ తో పెళ్లి కుదిరిన ఆనంద్ విహారి (నితిన్)తో ప్రేమలో పడుతుంది. అనసూయ తల్లి వల్ల ఆమె మేనమామ కుటుంబానికి జరిగిన నష్టమేంటి, కొన్ని ప్రత్యెక పరిస్థితుల వల్ల అనుపమ పరమేశ్వరన్ ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆనంద్ విహారి తన మేన కోడలు అనసూయను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి? అన్నది క్లుప్తంగా కథ.
విశ్లేషణ:
పేరుకి నితిన్ హీరో అయినా.. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తీర్చి దిద్ధబడిన సినిమా “అ.. ఆ”. రెగ్యులర్ సినిమాల్లో హీరోయిన్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో.. ఈ సినిమాలో నితిన్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో నడుస్తుంది. అయితే నితిన్ తన పాత్ర అనుమతించినంత వరకు పూర్తి న్యాయం చేసాడు. చాలాచోట్ల చాలా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసాడు. ఒకటి రెండు సీన్స్ లో వ్యాంప్ టైపు భంగిమలలో సైతం కవ్వించిన సమంతా.. సినిమా మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. నటన పరంగానూ ఈ అమ్మడు మంచి మార్కులు స్కోరు చేసింది. అయితే.. ప్రేమమ్” ఫేం అనుపమ పరమేశ్వరన్ పాత్రను మాత్రం దర్శకుడు సరిగా డిజైన్ చేసుకోలేక పోయాడు. బాల సుబ్రమణియన్ సినిమాటోగ్రఫి, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆయువుపట్లు కాగా.. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావును తన కత్తెరకు మరింత పదును పెట్టనివ్వాల్సింది అనిపిస్తుంది. రైల్వే ప్లాట్ ఫాం పై నితిన్ తో పాటు పరుగు తీసిన మధు నందన్.. ఆ తర్వాత కనిపించకపోవడం.. మొదట్లో ప్రకటించిన కేస్టింగ్ లిస్టు లో ఉన్న బ్రహ్మానందం సినిమాలో లేకపోవడం వంటి అంశాలను బట్టి.. తీసిన సినిమాకు బాగానే కోత విధించారన్న విషయం తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించాడు.పలు చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. కాకపోతే ఓ దర్శకుడిగా మాత్రం.. ఈ చిత్రం “అత్తారింటికి దారేది” కి నకలుగా మారకుండా చాలా పాట్లు పడ్డాడు. ఈ చిత్రానికి “అ.. ఆ” అనే పేరు పెట్టడం అందులో ఒకటి.
కాకపోతే.. ప్రతి సీన్ లోనూ ఫన్ పండించాలని ప్రయత్నిచడం, సంభాషణల పరంగా పదే పదే ప్రాస కోసం పాకులాడడం తగ్గించడం అవసరమన్న విషయాన్ని త్రివిక్రమ్ వీలైనంత త్వరగా గుర్తించాలి. ఉదాహరణకు.. అన్నపూర్ణమ్మ చనిపోయిన సీన్ లో సమంతా పడీ పడీ నవ్వడం చాల ఎబ్బెట్టుగా ఉంది. కేవలం ఫన్ కోసమే ఆ సీన్ ను క్రియేట్ చేసినప్పటికీ.. ఓ పెద్దావిడ చనిపోయినప్పుడు హీరోయిన్ పగలబడి నవ్వడం.. ఆ పాత్ర తాలూకు ఔచిత్యానికి భంగం కలిగిస్తుంది. అలాగే.. తన ఎదుగుదలకు సహకరించిన తన అన్నయ్య చావుకు కారణమయినా కూడా నదియాలో పశ్చాత్తాపం లేకపోవడం.. పైగా ఆ కుటుంబంపై కక్ష పెంచుకోవడం చాలా సినిమాటిక్ గా అనిపిస్తుంది. ప్రధమార్ధం అంతా ఫన్నీ డైలాగ్స్ తో బ్యూటిఫుల్ లోకేషన్స్ తో సాగిపోయిన “అ.. ఆ” ద్వితీయార్ధం వచ్చేసరికి సా..గు..తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్ష్ సరిగా పండలేదు. అయితే క్లయిమాక్స్ కి వచ్చేసరికి దర్శకుడిగా త్రివిక్రమ్ తనదైన మార్క్ చూపించగలిగాడు. లాస్ట్ సీన్ లో రావు రమేష్ తో పలికించిన పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని నవ్వించి.. సినిమా బాగుందా..బాగొలెధా అనే మీమాంసకు ఆడియన్స్ గురయ్యేట్లు చేయడంలో సఫలీకృతుడయ్యాడు. ఇక నదియ, నరేష్, రావు రమేష్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల అభినయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావినచేదేముంది? ప్రశంసించడం తప్ప!!
చివరిగా చెప్పాలంటే..
ఈ చిత్రం చివరిలో రావు రమేష్ తో త్రివిక్రమ్ ఇలా చెప్పిస్తాడు..
“రోడ్ వైడ్ నింగ్ కొట్టేసిన బిల్డింగ్ లా ఉంది మన పరిస్థితి.. ఉండడానికి వీలు కాదు.. వదలడానికి మనసు రాదు” .
ఈ స్టైల్ లో ఈ సినిమా గురించి చెప్పాలంటే..
“ఈ చిత్రం బాగుందని చెప్పడానికి వీలు కాదు.. బాగోలేధనడానికి మనసు రాదు”