టాలీవుడ్లో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సమంత. పెళ్లికి ముందు వరకు గ్లామరస్ రోల్స్‌లోనూ కనిపించిన సమంత ఆ తర్వాత రూటు మార్చింది. కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ.. నటిగా, వ్యాపారవేత్తగా దూసుకుపోతున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను షేర్చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉండగా అక్కినేని కోడలు సమంత..తన సోషల్ మీడియా అకౌంట్లలో ఇంటిపేరు ‘అక్కినేని’ని తొలిగించి అందరికీ షాకిచ్చింది.
కొన్నాళ్ల పాటు డేటింగ్ అనంతరం 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత.. పెళ్లైన వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్లలో సమంత పక్కన ‘అక్కినేని’ అనే పదాన్ని చేర్చుకొని తెలుగింటి కోడలుగా ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోయిన్ అయ్యిండి కూడా ఇంటిపేరును మార్చుకోవడం చాలా గొప్ప విషయం అంటూ పలువురు ఆమెపై ప్రశంసలు కురిపించారు. అప్పటినుంచి సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అన్నింటిలోనూ ‘సమంత అక్కినేని’ గానే ఉండేది.
ఇప్పుడు ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి అక్కినేని అనే పదాన్ని తొలిగించి కేవలం ‘ఎస్’ అనే పేరుతో డిస్ప్లే పేరును మార్చేసింది. దీంతో ఉన్నట్లుండి సమంత ‘అక్కినేని’ అనే పదాన్ని ఎందుకు తీసేసిందనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.