టాలీవుడ్ ప్రముఖ నటి సమంతపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ ప్రశంసల జల్లు కురిపించారు. అక్కినేని కోడలు నటించిన ‘ఓ బేబీ’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో సామ్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారని ఓ వెబ్‌సైట్ కథనం రాసింది. ట్విటర్‌లో నెటిజన్ల ట్వీట్లు, వీడియోల ఆధారంగా ఈ వార్తను ప్రచురించింది. ఈ వార్తను రంగోలీ రీట్వీట్ చేశారు. ‘ఓ బేబీ’ అద్భుతమైన విజయం అందుకుంది. సమంత అసలుసిసలైన ఫెమినిస్ట్. ఆమె జీవితం ఓ సక్సెస్ స్టోరీ. ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తనకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి దేవతల్ని మేం మెచ్చుకుంటాం. కంగన బృందం నుంచి మీకు ఆల్ ది బెస్ట్’ అని రంగోలీ ట్వీట్ చేశారు. ‘ఎంతో దయతో మాట్లాడిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సామ్ రిప్లై ఇచ్చారు.
‘ఓ బేబీ’ సినిమాకి సోషల్‌మీడియాలో నెటిజన్లు, విమర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాలోని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేశాయని, సమంత నటన చక్కగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. వీరికి సామ్ తిరిగి ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ‘ఓ బేబీ’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#OhBaby is bound to be a smashing hit, @Samanthaprabhu2 a true blue feminist & a huge success story, even though she belongs to one f the biggest film families bt her identity is her own..we hail such a goddess 🙏🙏All the best from team Kangana 💕 https://t.co/gUOHkE7ZCW
— Rangoli Chandel (@Rangoli_A) July 5, 2019