పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు తెలుగువారి టాలెంట్ కనిపించడంలేదా?.. మన తెలుగులోనే ఎందరో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మరి కొందరికి అవకాశాలే రావడంలేదు. ఎంతో టాలెంట్ ఉండి, తెలుగు స్వచ్ఛంగా ఉచ్ఛరించగలిగే సత్తా ఉన్నప్పటికీ వారికి ఎందుకు ఇండస్ట్రీలో గుర్తింపు రావడం లేదో తెలియడంలేదు. బహుశ తెలుగు వారు కావడమే వారు చేసిన పాపమా? లేక మన దర్శక, నిర్మాతలకు పొరుగు భాషపై ఉన్న మక్కువా? అలా అవకాశాలు తగ్గి తమలోని ప్రతిభను నిరూపించుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకుంటుంది మన యువత. తమలోని ప్రతిభను ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా నిరూపించుకుంటున్నారు. అలాంటి సెన్సేషనల్ వీడియోను సింగర్ కారుణ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సంగీత విధ్వాంసుల కుటుంబం నుంచి వచ్చిన కారుణ్య నాలుగేళ్ల వయస్సునుంచే సంగీతంలో శిక్షణ పొందాడు. చిన్నతనంలోనే ‘చిరు సరిగమలు’ పేరుతో ఆల్బమ్ చేశాడు. దానిని అప్పట్లో ‘మెగాస్టార్ చిరంజీవి’ ఆవిష్కరించారు. ప్రముఖ టీవీ ఛానల్‌లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. తర్వాత జాతీయ ఛానెల్ సోనీ టీవీ నిర్వహించిన ‘ఇండియన్ ఐడల్’ సీజన్-2 లో రన్నరప్‌గా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి కారుణ్య తనలోని టాలెంట్ చూపిస్తూ ‘అల..వైకుంఠపురంలో’ సినిమాలోని వైరల్ అయిన ‘సామజవరగమన’ పాటను మాషప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ పాటను ఆ సినిమాలో ఇండియన్ అమెరికన్ సిద్దు శ్రీరామ్ ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాటలో శ్రీరామ్ ఉచ్ఛరించిన పదాల కంటే కారుణ్య పద ఉచ్ఛరణ చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో ఆలపించాడు. శ్రీరామ్ కంటే కారుణ్య గొంతులో తెలుగు పదాల స్వచ్ఛత, స్పష్టత బాగా వినిపించింది. ఎక్కడా పదాలను పొర్లుపోకుండా అద్భుతంగా పలికించాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన దర్శక, నిర్మాతలు ఇప్పటికైనా తెలుగువారి సత్తా గుర్తిస్తాని ఆశిద్దాం. మరి ఈ పాట మీరూ వినండి…