HomeTelugu Reviews'సలార్‌' మూవీ రివ్యూ

‘సలార్‌’ మూవీ రివ్యూ

Salaar Review and Ratingపాన్ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం సలార్‌. ఈ సినిమాకి ‘కె.జి.యఫ్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి హైప్స్‌ ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల హోప్స్‌ని ఎంతవరకూ నిలబెట్టుకుంది… వారి నిరీక్షణ ఫలించిందా అనేది చూద్దాం..

దేవా (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ప్రాణ స్నేహితులు. వరద కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే మిత్రుడు దేవా. ఒకరోజు కొందరు దేవా తల్లి (ఈశ్వరీరావు)పై దాడిచేయడానికి వస్తారు. వాళ్ల నుంచి దేవాను, అతడి తల్లిని వరదరాజ కాపడతాడు. వాళ్లను ఖాన్సార్ నుంచి దూరంగా పంపేస్తాడు. గతాన్ని మరిచిపోయి దేవా తన తల్లితో కలిసి ఇండియా-బర్మా బోర్డర్‌లోని టిన్సుకియాలో ఉంటాడు. తల్లి మాట జవదాటకుండా ఒక గనిలో మెకానిక్‌గా పనిచేసుకుంటూ కాలం వెల్లదీస్తాడు. ఈ సమయంలో ఆధ్య (శృతిహాసన్)ను దేవా కాపాడాల్సి వస్తుంది. ఈమెను కాపాడడం వల్ల దేవా చిక్కుల్లో పడతాడు. అసలు ఎవరు ఈ ఆధ్య? ఆమెకు ఖాన్సార్‌కు సంబంధం ఏంటి? ఖాన్సార్‌లో దేవా, అతడి తల్లిపై దాడి చేసినవారు ఎవరు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వాస్తవానికి సలార్ కథ కాస్త టిపికల్‌గా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సినిమాలో పాత్రలు చాలా ఎక్కువ. వాటిని వివరించడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్న సమయం చాలా తక్కువ. ఎందుకంటే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు, ఎలివేషన్లకే ఎక్కువ సమయం కేటాయించారు. ప్రభాస్‌ను ఎలా అయితే చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలా చూపించారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ నరుకుతుంటే.. మళ్లీ ‘ఛత్రపతి’లోని శివ గుర్తుకొస్తాడు. కానీ, ఈ దేవా రేంజ్ మాత్రం శివ కంటే చాలా ఎక్కువ. ఒక ఉగ్రరూపంలా కనిపిస్తుంది ప్రభాస్ కటౌట్. యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్‌ను చూస్తుంటే ఫ్యాన్స్ తమను తాము మైమరిచిపోవడం ఖాయం.

Salaar Movie Review

సినిమా మొదలైన తర్వాత సుమారు 45 నిమిషాల వరకు ఏమీ లేదే అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత పరుగు మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వల్ బ్యాంగ్ ఓ రెంజ్‌లో ఉంటాయి. తల్లి మాటకు కట్టుబడి ఎవరేమన్నా చేయి ఎత్తకుండా పక్కకు తప్పుకుని వెళ్లిపోయే దేవా.. మళ్లీ ఆ తల్లే ఇక మొదలుపెట్టు అన్నప్పుడు జరిగిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఇంటర్వల్ వరకు కథ సింపుల్‌గానే అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ మొదలైన తర్వాత ఒకరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఖాన్సార్ కథ చెప్తూ తెరపై దేవా విధ్వంసం చూపిస్తుంటే ప్రేక్షకుడు కథకు కనెక్ట్ కావడం కొద్దిగా కష్టమవుతుంది.

సెకండాఫ్‌లో ప్రశాంత్ నీల్ రాసుకున్న సీన్లలో ఇంకాస్త స్పష్టత ఉంటే బాగుండేది. అలాగే ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ అయ్యింది. కానీ, ఫైట్స్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ తోపు అనిపిస్తుంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్, ఫైట్లు, ఆయన గెటప్ అదిరిపోయాయి. ఈ విషయంలో ప్రశాంత్ నీల్‌ను ప్రశంసించకుండా ఉండలేం. అభిమానులు ఎలా అయితే కోరుకున్నారో దానికి రెండింతలు ఎక్కువగానే ప్రభాస్‌ను చూపించారు. ప్రశాంత్ నీల్ సినిమాలో డైలాగులు కాస్త తక్కువగానే ఉంటాయి. ఇక ఈ సినిమా కథనం కూడా ప్రశాంత్ నీల్ స్టైల్‌లో టిపికల్‌గా ఉంటుంది. అది కాస్త కనెక్ట్ అవ్వడం కష్టం. కానీ, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఫైట్లు మాత్రం రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. అయితే, ‘సలార్’ కథలో చాలా ప్రశ్నలను రెండో భాగం కోసం వదిలేశారు దర్శకుడు. ప్రాణ స్నేహితులే బద్ధ శత్రువులుగా మారారని ట్రైలర్‌లో చెప్పారు. అయితే, ఎలా బద్ధశత్రువులుగా మారారు అనేది రెండో భాగంలో చూడాలి. అసలు సలార్ ఎవరు? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటనే విషయాన్ని ఈ మొదటి భాగంలో రివీల్ చేశారు. ఆ ట్విస్టే ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తుంది. ఆ కిక్కుతోనే థియేటర్ నుంచి బయటికి వస్తాడు.

జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, గరుడ రామ్, జాన్ విజయ్, బాబీ సింహా, బ్రహ్మాజీ, టిను ఆనంద్, మైమ్ గోపి, షఫీ.. ఇలా అందరూ తమ పాత్రల్లో జీవించేశారు. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డైలాగులు తక్కువే కానీ ఆయన స్టైల్, మేనరిజం, యాక్షన్ మామూలుగా లేవు. ఫ్యాన్స్‌కి ఆయన ప్రెజెన్స్ ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద కనబడితేనే లేచి ఈలలు వేసేలా ఉంటారు. సినిమాకు ఊపిరి సలార్ పాత్రే. సినిమా టెక్నికల్‌గానూ చాలా బాగుంది. ఖాన్సార్ అనే సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. ఇది ఒక యూరప్ సిటీలా అనిపిస్తుంది. భువన గౌడ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu