HomeTelugu Newsసాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం!

సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం!

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016
సంవత్సరానికిగాను శ్రీ కృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనులపండువగా జరిగింది.
డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ సాహితీవేత్త, డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ నటి
జయప్రద, కన్నడ సాహితీ దిగ్గజం డా|| బరగూరు రామచంద్రప్పలకు శ్రీకృష్ణదేవరాయల
పురస్కారాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రదానం చేసి అభినందించారు.
పురస్కారాలు అందుకున్న తర్వాత డా. యార్లగడ్డ మాట్లాడుతూ – ”తెలుగోడి గొప్పదనాన్ని
కవితారూపంలో అభివర్ణించారు. కర్ణాటకాంధ్ర మహాప్రభు రాయల పేరిట పురస్కారాలు అందుకోవడం
సంతోషంగా ఉందన్నారు. మా ఆదికవి నన్నయ్య కన్నడిగుడు. మీ హంపా మా తెలుగువాడు
అంటూ ఆయన సభికులనుద్దేశించి అన్నారు. కర్ణాటకలో భాషా అల్ప సంఖ్యాకులుగా ఉన్న
తెలుగు ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డా. జయప్రద తెలుగు,
కన్నడ భాషలను మిళితం చేసి ప్రసంగించారు. మరో జన్మంటూ ఉంటే కళాకారిణిగానే పుడతానన్నారు.
తాను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా కర్ణాటక మెట్టినిల్లు అన్నారు. కన్నడ సాహితీదిగ్గజం
డా. బరగూరు రామచంద్రప్ప మాట్లాడుతూ – ”సమాఖ్య వ్యవస్థలో అన్ని భాషల ప్రజలు
సామరస్యంగా ఎలా జీవించాలో తెలుగు, కన్నడిగులు చాటి చెబుతున్నారంటూ ప్రశంసించారు.
దేశం మొత్తానికి ఇది ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షించారు. డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌
మాట్లాడుతూ.. ”తన మాతృభాష తెలుగు అయినా జీవన భాష కన్నడ అని గర్వంగా చెప్పారు.
శ్రీకృష్ణదేవరాయల పేరిట తెలుగు, కన్నడ భాషలలో ఓ సీరియల్‌ నిర్మించాలన్న ఆలోచన ఉందన్నారు.
తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జయచంద్రారెడ్డి,
ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్‌, కళాబంధు డా. టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu