సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్ మీడియో అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని మాదాపూర్ లో బైక్ స్కిడ్ అయ్యి, యాక్సిడెంట్ జరగగా, సాయి తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి, ఆ తరువాత అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొంతకాలం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్న తేజ్ ను ఇంటికి తీసుకెళ్లి చికిత్స కొనసాగించారు. అప్పటి నుంచి అభిమానులకు అస్సలు కన్పించట్లేదు తేజ్. అప్పుడప్పుడూ ఆయన ఫొటోలు బయటకు వస్తున్నా, తేజ్ ను డైరెక్ట్ గా చూడాలని కోరుకున్నారు ఆయన అభిమానులు.
ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెర పడింది. ఫొటోలు మాత్రమే విడుదల చేస్తుండడంతో వచ్చిన అనుమానాలు అన్నింటికీ చెక్ పెట్టేశారు తేజ్. తాజాగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో అభిమానులకు, తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, ఇంకా కుటుంబ సభ్యులకు, పవన్, చిరులకు థ్యాంక్స్ చెప్పారు తేజ్. అంతేకాదు ఈ నెల 28న తన కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, దానిని సుకుమార్, బాబీ నిర్మిస్తారని వెల్లడించారు. అయితే తేజ్ వీడియోలో ఇంకా నీరసంగానే కన్పిస్తుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.