ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా కారణంగా.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం నెల్లూరు జిల్లా కోనేటమ్మకోటలో 1946 జూన్ 4న.. సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాకోసం తొలిసారి గాత్రదానం చేశారు. ఘంటసాల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న బాలు.. 50 ఏళ్ల ప్రస్థానంలో 14 భాషల్లో 40వేలకు పైగా పాటలు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, తుళు, ఒరియా, అస్సామీ, బడగ, సంస్కృతం, కొంకణి. బెంగాలి, మరాఠి, పంజాబీతో పాటు ఇంగ్లీషులోనూ పాటలు పాడారు.
అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా ఎస్పీ బాలు గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి భారత అత్యున్నత పురస్కారాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను ఎన్నో అందుకున్నారు. పలు నేషనల్ అవార్డులు, నంది అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. 2016లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. సుమారు వందకు పైగా సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. సుమారు 45 సినిమాల్లో నటనాకౌశలాన్ని బాలు ప్రదర్శించారు. సినిమాల్లో కథానాయకుడిగా, సపోర్టింగ్ యాక్టర్‌గా నటించిన బాలు.. 2012లో మిథునం సినిమాలో నటనకుగాను బాలుకు నంది పురస్కారం అందుకున్నారు.