దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 175 నియోజక వర్గాల్లో రైతు దినోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు దినోత్సవం కోసం నియోజకవర్గానికి రూ. లక్ష చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. రైతు దినోత్సవం మార్గదర్శకాలనూ విడుదల చేసింది.
జమ్మలమడుగులో జరగబోయే రైతు దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. వైఎస్సార్ పింఛన్ పథకాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతుల సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అన్నదాతల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500
చొప్పున అందించనున్నారు.