RX 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఓ ఇంటివాడయ్యారు. శనివారం హైదరాబాద్లో ఆయన వివాహ వేడుక వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిరీష అనే అమ్మాయిని ఆయన మనువాడారు. ఈ శుభకార్యానికి హీరో కార్తికేయ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కార్తికేయ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ నా బాస్ అజయ్ భూపతికి బాస్ వచ్చారు (నవ్వుతున్న ఎమోజీ). శుభాకాంక్షలు సర్’ అని ట్వీట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దగ్గర అజయ్ భూపతి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆయన తన తొలి సినిమా RX 100తో సూపర్ హిట్ అందుకున్నారు. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించిన ఈ సినిమాను అశోక్ రెడ్డి నిర్మించారు. చేతన్ భరద్వాజ్ బాణీలు అందించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది.