డైరెక్టర్ గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) సినిమాలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు హీరో, హీరోయిన్‌లు శింబు, త్రిష. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చూసి చాలా మంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది.
అయితే మరోసారి వీరి పెళ్లి వార్తలు జోరు అందుకున్నాయి. లాక్‌డౌన్ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ అనే షార్ట్ ఫిల్మ్ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి.. శింబు-త్రిష పెళ్లి గురించి స్పందించమని కోరగా.. ఆయన మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.