హిందీలో బిగ్‌బాస్ 14వ సీజన్ ను పూర్తి చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా గత సంవత్సరం అక్టోబర్ లోదలైన 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే పూర్తికాగా రుబీనా దిలైక్ విన్నర్‌గా నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ధర్మేంద్ర వచ్చి, షోలే సినిమాలోని పాప్యులర్ డైలాగులు చెప్పి, ప్రేక్షకులను అలరించారు. ఈ రియాల్టీ షోలో గెలిచిన ఆమెకు రూ. 36 లక్షల ప్రైజ్ మనీని నిర్వాహకులు అందించారు. ట్రోఫీని బహూకరించిన సల్మాన్ ఖాన్, ఆమె భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ షోలో రన్నరప్ గా రాహుల్ వైద్య నిలిచారు. వీరిద్దరి మధ్య తొలి నుంచి తీవ్రమైన పోటీ నెలకొనగా, చివరకు షో చూసే అభిమానులు రుబినాకు మద్దతుగా నిలిచారు. రాహుల్ కన్నా ఆమెకు రెండు శాతం అదనపు ఓట్లు రావడంతో రుబీనానే విజేతగా ప్రకటించారు సల్మాన్ ఖాన్.
ఇక ఫైనల్ లో రుబీనా, రాహుల్ వైద్యలతో పాటు అలీగొని, నిక్కింత బొలి, రాఖీ సావంత్ నిలిచారు. కంటెస్టెంట్లకు చిట్టచివరి టాస్క్ గా రూ. 14 లక్షలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయే వారు ఎవరైనా ఉంటే, 30 సెకన్లలోపు బజర్ మోగించాలన్న ఆఫర్ ను సల్మాన్ ఇవ్వగా, రాఖీ సావంత్ ముందుకు వచ్చింది. ఆమె రూ. 14 లక్షలతో హౌస్ నుంచి వెళ్లిపోగా, ఆపై అలిగొని ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించిన సల్మాన్, ప్రేక్షకుల ఓటింగ్ మేరకు నిక్కి తంబోలీ కూడా వైదొలగినట్టేనని స్పష్టం చేశాడు.