తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా సమ్మెచేస్తున్నారు. ఇవాళ జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్ ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.. తెలంగాణ బంద్, సమ్మె ప్రభావం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జేఏసీ నేతలు.. బంద్ విజయవంతమైందని ప్రకటించారు.. బంద్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని.. బంద్‌ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు… రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం చేస్తాం.. రేపు అన్ని చౌరస్తాలు, డిపోల దగ్గర నిరసన కార్యక్రమాలు, ఆందోళనను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. “ఆర్టీసీని రక్షించండి-ప్రజా రవాణాను కాపాడండి” అనే నినాదంతో నిరసల్లో పాల్గొంటామని తెలిపారు.
హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలని జేఏసీ నేతలు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరపాలని కోరిన జేఏసీ.. కోర్టులకు ఇచ్చే అఫిడవిట్లలో సర్కార్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హెచ్చరించారు. ఇక, ఆందోళన సమయంలో మహిళా కార్మికులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. తెలంగాణ బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమైందని అన్నారు. ఉద్యమకారుల తలలు నరికినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.