విశాఖపట్నంలో గ్యాస్‌లీక్ ఘటనతో అనేక మంది ప్రాణాలు బలిగొన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీచేసింది. ప్రాణ నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా ఆధారంగా రూ. 50 కోట్లు మధ్యంతర జరిమానాగా జమచేయాలని ఆదేశించింది. ఘటనపై నిజనిర్ధారణకు జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మే 18 లోగా దర్యాప్తు చేసి ఘటనపై నివేదిక ఇవ్వనుంది. కమిటీ సభ్యులుగా ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ రామచంద్రమూర్తి, ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ పులిపాటి కింగ్, సీపీసీబీ సభ్య కార్యదర్శి, నీరి హెడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ ను నియమించింది.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 12 మంది మృతిచెందగా, వందలాదిమంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నష్టపరిహారం కింది రూ. 50 కోట్లు కలెక్టర్ జమచేయాలని సంస్థను ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ నిబంధనలు, ప్రమాదకర రసాయనాలు నిబంధనలు లేవని స్పష్టమవుతోందని, భారీ మొత్తంలో విషవాయువులు వెలువడడానికి కచ్చితంగా
ఆ సంస్థ బాధ్యత వహించాల్సిందేనని ఎన్టీటీ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీని నియంత్రించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారు కూడా బాధ్యులేనని, ఈ ఘటనకు దారితీసిన కారణాలు, లోపాలు, నష్టం, తదుపరి చర్యలపై దృష్టి పెట్టామని పేర్కొంది.