
Karnataka Ticket Rates:
కర్నాటకలో థియేటర్ల టికెట్ రేట్లపై షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య తాజా బడ్జెట్‌లో టికెట్ ధరను రూ.200కు పరిమితం చేయాలని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రేక్షకులకు అనుకూలంగా కనిపించినా, మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులను తీవ్ర ఆందోళనలో పడేసింది.
2017లోనూ ఇలాంటి ప్రయత్నం జరిగింది కానీ అప్పట్లో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు వ్యతిరేకించి ఆ నిబంధనను అమలు చేయించకుండా నిలిపివేశారు. కానీ ఈసారి అన్ని థియేటర్లపై, ఇమ్యాక్స్ (IMAX), రిక్లైనర్ స్క్రీన్‌లపై కూడా ఈ రూల్ వర్తించనుంది.
బెంగళూరులో పీవీఆర్ డైరెక్టర్స్ కట్ వంటి థియేటర్లు ఒక్కో సీట్‌కు రూ.1,400 వరకు వసూలు చేస్తాయి. ఇలాంటి థియేటర్లకు రూ.200 ధర విధించడం వల్ల వారు నాణ్యమైన అనుభవాన్ని అందించగలరా అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మినహాయింపులు కోరే అవకాశముంది. మరికొందరు వ్యాపార మోడల్‌ను మార్పులు చేసుకోవాల్సి వస్తుందేమో. దీనివల్ల ఇమ్యాక్స్, 4DX స్క్రీన్‌ల సంఖ్య తగ్గిపోతుందనే భయాలు ఉన్నాయి.
అయితే, టికెట్ ధర తగ్గితే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేందుకు ప్రోత్సాహం కలిగించవచ్చు. కానీ మల్టీప్లెక్స్‌లు నాణ్యత తగ్గిస్తే, కర్నాటకలో పెద్ద సినిమాలు, గ్రాండ్ ప్రీమియర్లకు ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం థియేటర్ యజమానులను సంక్షోభంలోకి నెట్టేస్తుందా? లేక ప్రజలకు మెరుగైన వినోదాన్ని అందించడంలో సఫలీకృతమవుతుందా? సమయం సమాధానం చెప్పాలి.