సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘రౌదం రణం రుధిరం'(ఆర్‌ఆర్‌ఆర్). బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ వహించిన చిత్రం కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథ: ఆర్‌ఆర్‌ఆర్ కథంతా 1920 ప్రాంతంలో జరుగుతుంది. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలో విశాఖపట్నానికి చెందిన రామరాజు(రామ్ చరణ్) పోలీసు అధికారిగా పని చేస్తుంటాడు. పదోన్నతి కోసం పై అధికారుల ఆదేశాలనుగుణంగా పని చేస్తుంటాడు. మరదలు సీత(ఆలియా భట్), గ్రామస్తులకు ఇచ్చిన మాట నెరవేరాలంటే.. ఆయన పదోన్నతి పొందాల్సిందే. అందుకే దాని కోసం స్వాతంత్య్ర పోరాట యోధులపై కూడా దాడి చేస్తాడు. మరోవైపు గవర్నర్ స్కాట్(రే స్టీవెన్ సన్) ఓ సారి ఫ్యామిలీతో కలిసి ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. అక్కడ గోండు జాతికి చెందిన బాలిక మల్లిని తమతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తాడు. తమ బిడ్డని తీసుకెళ్లొద్దని అడ్డుకున్న కుటుంబ సభ్యులపై దాడి చేయిస్తాడు. ఇది అన్యాయం అని భావించిన గోండు జాతి బిడ్డ భీమ్ (ఎన్టీఆర్).. ఎలాగైన మల్లిని తిరిగి తీసుకురావాలని భావిస్తాడు. తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వెళ్తాడు. పకడ్బందీ బందోబస్తు ఉన్న బ్రిటీష్ కోటలోకి భీమ్ ఎలా వెళ్లగలిగాడు? అక్కడే పోలీసు అధికారిగా ఉన్న రామరాజు, ఎన్టీఆర్ ఎలా స్నేహితులు అయ్యారు? ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు? అసలు రామరాజు తన మరదలు, గ్రామస్తులకు ఇచ్చిన మాట ఏంటి? అతని నేపథ్యం ఏంటి? శక్తిమంతులైన ఈ ఇద్దరు కలిసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ : రాజమౌళి ఏ సినిమా చేసినా ప్రేక్షకులు సంతృప్తి పడే వరకు తీయడం అలవాటు. అందువల్లే బాహుబలి కోసం ఐదేళ్లు పట్టింది. అయితే ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా కోసం శ్రమించాడు రాజమౌళి. ఆయన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఓ చిన్న పాయింట్‌ని కథగా ఎంచుకొని,దానికి భావోద్వేగాలు రంగరించి, కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. గిరిజన బాలికను బ్రిటీష్ సైన్యం ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది. నీరు, నిప్పు అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత్రలను పరిచయం చేశారు. అందుకు తగ్గట్టే బలమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇద్దరు హీరోలు కలిసే సీన్‌ని కూడా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ఇంటర్వెల్ సన్నివేశం అయితే.. సినిమాకే హైలెట్. బ్రిటీష్ కోటలోకి ఎన్టీఆర్ వెళ్లే సన్నివేశం గూస్‌బమ్స్ తెప్పిస్తాయి. ఫైట్ సీన్‌తో చాలా ఎమోషనల్‌గా ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఇక సెకండాఫ్‌లో అజయ్‌దేవ్‌గణ్, శ్రియల ఎంట్రీ.. కథను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. భీమ్‌ని అరెస్ట్ చేసి శిక్షించే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. ‘కొమరం భీముడో.. కొమరం భీముడో’ అనే పాట హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత కథ కొంత స్లోగా సాగుతుంది. ఇక భీమ్, రామ్ కలిసిన తర్వాత వచ్చే ఫైట్ సీన్స్ మరో లెవల్. అయితే జైల్లో ఉన్న రామ్‌ని తీసుకురావడానికి భీమ్ వెళ్లే సీన్, అతన్ని ఎక్కడ ఉన్నాడో కనుక్కునేందుకు శబ్దం చేయడం లాంటివి కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ‘నక్కల వేట ఎంత సేపు.. కుంభ స్థలాన్ని బద్దలు కొడదాం పదా’అంటూ ఇద్దరు కలిసి బ్రీటీష్ కోటపై దాడి చేసిన తీరు అందరిని మెప్పిస్తుంది.
నటీనటులు: భీమ్‌గా ఎన్టీఆర్, రామరాజుగా రామ్ చరణ్.. తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి సీన్‌లోనూ నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటిగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే పోరాట ఘట్టాలు అయితే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. నాటు నాటు పాటకు ఈ ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులు అయితే థియేటర్స్‌లో ఈలలు వేయిస్తాయి. ఈ సినిమా కోసం తారక్, చెర్రి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తోంది.
ఇక సీత పాత్రలో ఆలియా భట్, జెన్నీఫర్ అనే బ్రిటీష్ యువతిగా ఒలివియా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వెంకట రామరాజు అలియాస్ బాబాగా అజయ్ దేవ్‌గణ్, అతని భార్య సరోజిగా శ్రియ.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. వీరి పాత్రల నిడివి తక్కువే అయినా.. సినిమాకు అవి కీలకంగా ఉంటాయి. విలన్ స్కాట్ పాత్రలో రేస్టీవెన్ సన్, అతని భార్యగా అలిసన్ డూడీ తనదైన నటనతో మెప్పించారు. రామరాజు బాబాయ్‌గా సముధ్రఖని, భీమ్ స్నేహితుడు లచ్చుగా రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమాకు మరో ప్రధాన బలం ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. రాజమౌళి ఊహించుకున్న ప్రతి సీన్‌ని తెరపై అద్భుతంగా చూపించాడు. సాల్మన్ పోరాట ఘట్టాలు సినిమా స్థాయిని పెంచాయి. 1920నాటి కథకు జీవకళ ఉట్టిపడేలా సెట్స్‌ని తీర్చిదిద్దాడు ప్రొడెక్షన్ డిజైనర్ సాబు సిరిల్. సాయి మాధవ్ బుర్రా మాటలు.. తూటాల్లా ఉన్నాయి. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
టైటిల్ :రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్)
నటీనటులు : ఎన్టీఆర్, రామ్‌చరణ్,అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, ఒలివియో మోరీస్,తదితరులు
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాతలు: డీవీవీ దానయ్య
సంగీతం : ఎం.ఎం. కీరవాణి
హైలైట్స్: రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన
డ్రాబ్యాక్స్: సెకండ్‌హఫ్ లో కొన్ని సాగదీత సన్నీవేశాలు
చివరిగా: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోతకు థియేటర్స్ దద్దరిలిపోతున్నాయ్
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)