టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, యంగ్ టైగర్ తారక్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాకపోతే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పటికే ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలో సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ టికెట్ ధరల వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ని వాయిదా వేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాయిదాల పర్వం కొనసాగుతోన్న తరుణంలో సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ వాయిదాపై పలు రకలుగా స్పందిస్తున్నారు. వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.