టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన తాజా చిత్రం‘రొమాంటిక్’. పూరి ఈ సినిమాకి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. ఈ సినిమాతోనే కేతిక శర్మను కథానాయికగా హీరోయిన్‌గా నటించింది. అనిల్ పాదూరిని దర్శకుడిగా తెరకు పరిచయం అయ్యాడు. మరీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందా? చూద్దాం.
కథ: వాస్కోడిగామా (ఆకాష్ పూరి) ఓ అనాథ. తన లాంటి అనాథల కోసం ఇళ్లు కట్టించాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే డబ్బు సంపాదన కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో రెండు ముఠాల మధ్య అధిపత్య పోరు నడుస్తుంటుంది. వాస్కోడిగామా ఓ ముఠాలో చేరి.. అనతి కాలంలోనే ఆ ముఠా నాయకుడిగా ఎదుగుతాడు. ఇదే సమయంలో గోవా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారతాడు. అయితే అతని జోరును ఆపడానికి ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ)ను రంగంలోకి దించుతుంది ప్రభుత్వం.
వాస్కోని, అతని గ్యాంగ్‌ను అంతం చేయడమే ఆమె లక్ష్యం. గోవార్కర్ రంగంలోకి దిగాక.. వాస్కో లక్ష్య సాధనకు అనేక సవాళ్లెదురవుతాయి. ఈ క్రమంలోనే మౌనిక (కేతిక శర్మ)తో వాస్కో సాగిస్తున్న రొమాంటిక్ ప్రయాణంలోనూ ఇబ్బందులెదురవుతాయి. మరి వాటిని వాస్కోడిగామా ఎలా ఎదుర్కొన్నాడు? ఏసీపీ రమ్యకు వాస్కో చిక్కాడా?మౌనికతో అతనికున్న రొమాంటిక్ బంధం ఏంటి? అది ప్రేమా? లేక తను నమ్మే మోహమా? అన్నది తెరపై చూడాలి.
నటీనటులు: ఆకాష్ పూరి నటనలో పరిణతి కనిపించింది. వాస్కోడిగామా పాత్రను చక్కగా అర్థం చేసుకుని.. ఆ పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. పతాక సన్నివేశాల్లో అతడి నటన అందరినీ కట్టిపడేస్తుంది. అయితే ఇలాంటి బరువైన కథలకు తను కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిదనిపిస్తుంది. కేతిక శర్మ తెరపై చాలా అందంగా కనిపించింది. నటన పరంగా చూపించడానికి పెద్దగా ఆస్కారం దొరకలేదు. రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం చెలరేగిపోయింది. రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ చక్కగా ఒదిగిపోయింది. ఆమె పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణ. మకరంద్ దేశ్ పాండే పాత్రను సరైన రీతిలో వాడుకోలేదనిపిస్తుంది. ఉత్తేజ్, రమాప్రభా తదితరుల పాత్రలు పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ: గోవా నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా కూడా ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘హార్ట్ ఎటాక్’తరహాలో సాగినదే. ప్రథమార్ధంలో వాస్కోడిగామాగా ఆకాష్‌ను పరిచయం చేసిన తీరు.. డ్రగ్స్ దందాలో అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన వైనం అన్నీ ‘బిజినెస్‌మెన్’ చిత్రాన్ని తలపించేలా ఉంటాయి. మోహం పేరుతో వాస్కో.. మౌనిక వెంట పడే సన్నివేశాలు, ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ఎపిసోడ్‌లు యూత్‌ని ఆకట్టుకుంటాయి. రమ్య గోవార్కర్ పాత్ర తెరపైకి వచ్చాక.. కథలో కాస్త వేగం పెరుగుతుంది. అయితే కుదిరితే యాక్షన్.. లేదంటే రొమాన్స్.. రెండూ కాదంటే ఓ పాట అన్నట్లుగా సాగే ప్రథమార్ధం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది.
ద్వితీయార్ధంలోనైనా పూరి శైలి మెరుపులు ఏమన్నా కనిపిస్తాయనుకుంటే.. అక్కడా ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. వాస్కోడిగామాను పట్టుకునేందుకు రమ్య గోవార్కర్ చేసే ప్రయత్నాలు చాలా చప్పగా సాగుతాయి. పదే పదే హీరోయిన్‌ను అడ్డు పెట్టుకుని హీరోను పట్టుకోవాలనుకోవడం.. ఆ ప్రయత్నాలు మరీ సిల్లీగా ఉండటంతో ప్రేక్షకులు ఏ ఎపిసోడ్‌తోనూ కనెక్ట్ అయ్యే పరిస్థితి కనిపించదు. పతాక సన్నివేశాల్ని భావోద్వేగభరితంగా తీర్చిదిద్దిన తీరు.. విషాదాంతపు ముగింపు అందరినీ ఆకట్టుకుంటుంది.
టైటిల్ : రొమాంటిక్
నటీనటులు :ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు
నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ
దర్శకత్వం: అనిల్ పాదూరి
సంగీతం : సునీల్ కశ్యప్
హైలైట్స్: రమ్య కృష్ణ నటన
డ్రాబ్యాక్స్: కొన్ని కొన్ని సన్నివేశాలు
చివరిగా: ‘రొమాంటిక్’ యూత్‌ని ఆకట్టుకుంటుంది
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)