కన్నడలో భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతర’. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమాని డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో సైతం ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
భూతకోల సంస్కతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించారు రిషబ్ శెట్టి. కోలం ఆడే వ్యక్తి ‘ ఓ.. ‘ అంటూ అరుస్తూ డ్యాన్స్ చేస్తాడు అని ఈ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చిన ప్రతిసారి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ప్రేక్షకులు కూడా ఆ అరుపులను అంత ఈజీగా మర్చిపోవడం లేదు. సినిమా చూసి బయటకు వచ్చాక ‘ఓ’ అంటూ గట్టిగా శబ్దం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా ఈ విషయంపై రిషబ్‌శెట్టి స్పందించారు. ‘ఓ..’ అని శబ్దం చేయడం తమ సెంటిమెంట్ అని, ఇదొక నమ్మకమని అన్నారు. ‘ కాంతార’ వీక్షించిన ప్రేక్షకులు ఈ శబ్దాలను అనుకరించొద్దని విజ్ఞప్తి చేశాడు. అది చాలా సున్నితమైన అంశమని, బయట ఇలా శబ్దం చేయడం వల్ల తమ ఆచారం దెబ్బ తినొచ్చని అని అన్నారు.