తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116 కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 30 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు, ఆదిలాబాద్‌లో 3, జోగులాంబ గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదుకావడంతో అక్కడ కలకలం రేగింది. తాజాగా నమోదైన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకు 186 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ కాగా 18 మంది మృతి చెందారు. 562 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.