నటీనటులు:
సుమంత్ అశ్విన్, పూజా ఝవేరి, ప్రభాకర్ (కాలకేయ), పావని గంగిరెడ్డి, నాజర్, షకలక శంకర్ తదితరులు..
సాంకేతికవర్గం:
సంగీతం: జె.బి
ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్
మాటలు: “డార్లింగ్” స్వామి
నిర్మాత: జె.వంశీ కృష్ణ
దర్శకత్వం: మను
విడుదల తేది: 10/6/2016
రేటింగ్: 1.5/5
“అంతకుముందు ఆ తర్వాత, లవర్స్” లాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో ఉన్నప్పటికీ.. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడిగానే గుర్తింపబడే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్. ఇతగాడి మునుపటి చిత్రం “కొలంబస్” ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో.. మలయాళంలో 2012లో విడుదలైన “ఆర్డినరీ” అనే సెన్సిబుల్ కామెడీ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని.. దాన్ని “రైట్ రైట్” అనేపేరుతో రీమేక్ చేశారు. మను ఈ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించగా.. పూజా ఝవేరి కథానాయికగా నటించింది.
మలయాళంలోనే యావరేజ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో? కథానాయకుడిగా సుమంత్ అశ్విన్ కు హిట్ ను కట్టబెడుతుందో లేదో? చూద్దాం..!!
కథ:
విశాఖ జిల్లాలోని “ఎస్.కోట టు గవిటి” ఆర్డినరీ బస్సు డ్రైవర్ శేషు (ప్రభాకర్), కండెక్టర్ రవి (సుమంత్ అశ్విన్). ఈ ఇద్దరు కలిసి తమ తమ వృత్తులను చక్కగా నిర్వర్తిస్తుంటారు. గవిటిలోని కళ్యాణి (పూజా ఝవేరి)ని ప్రేమిస్తుంటాడు రవి. అదే ఊరిలో ఉండే మరో అమ్మాయిని ప్రేమిస్తుంటాడు శేషు. ఇలా సరదాగా సాగుతున్న వీరి జీవితంలోకి విశ్వనాధ్ మాస్టర్ (నాజర్) గారి అబ్బాయి దేవ అనుకోని రీతిలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరిగాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు:
పోలీస్ అవ్వాలనుకొనే కండెక్టర్ అయిన యువకుడి పాత్రలో సుమంత్ అశ్విన్ నటన పరంగా ఫర్వాలేదనిపించుకొన్నాడు కానీ.. హావభావాల ప్రకటనలో మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాడు. సెంటిమెంట్ సీన్స్ లో అసలు బాధపడూతున్నాడో లేక మరో ఎక్స్ ప్రెషన్ ఇస్తున్నాడో అర్ధం కాక ఆడియన్ కన్ఫ్యూజ్ అవుతాడు.
డ్రైవర్ శేషు పాత్రలో “బాహుబలి” ఫేమ్ ప్రభాకర్ తన శక్తిమేరకు నటించడానికి, అప్పుడప్పుడూ డ్యాన్సులు చేయడానికి కూడా విఫలయత్నం చేశాడు. “విగ్రహపుష్టి- నైవేద్య నష్టి” అన్నట్లుగా ఉంది అతడి పాత్ర.
కథానాయికగా నటించిన పూజా ఝవేరి మొఖంలో హావభావాలు కానీ.. ప్రేమ సన్నివేశాల్లో సిగ్గు కానీ బూతద్దం పెట్టి వెతికినా దొరకావు. పాటల్లో నడుమందాలు చూపి మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. అదీ ఫలించలేదు.
ధనరాజ్, తాగుబోతు రమేష్ లు నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు, వేసిన పంచ్ లు వెగటుగా ఉంటాయి.
నాజర్, భరత్, పావని గంగిరెడ్డి తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
సినిమా మొత్తానికి.. కాస్తో కూస్తో ఆకట్టుకొన్నది జె.బి సంగీతం ఒక్కటే. మెలోడీలు బాగున్నాయి. నేపధ్య సంగీతం మాత్రం 1980 సినిమాలను తలపిస్తుంది. సీన్ లో సంగతి లేకపోవడంతో.. అతడు చేయగలిగింది కూడా ఏమీ లేదనిపిస్తుంది.
శ్రీమణి సాహిత్యం బాగుంది. కుదిరినంత మేరలో సన్నివేశానికి తగ్గట్లుగా పాటలు రాశాడు. టైటిల్ సాంగ్ లో ప్రకృతి అందాలను, మానసిక భావాలను వివరించిన తీరు బాగుంది.
శేఖర్ వి.జోసెఫ్ ఛాయాగ్రహణం మరీ బ్రైట్ గా ఉంది. ప్రకృతి అందాలను చూపించడం సరే.. నటీనటులను కూడా అందంగా చూపాలి కదా. అందులోనే.. హీరోహీరోయిన్లకు పెట్టిన టైట్ క్లోజ్ లు మరీ దారుణంగా ఉంటాయి.
డార్లింగ్ స్వామి సమకూర్చిన సంభాషణాల్లో ఎక్కగా సహజత్వం కనపడదు. ఇక ప్రాసల కోసం చేసిన ప్రయత్నం అక్కడక్కడా కాస్త శృతి మించింది.
రచన-దర్శకత్వం:
మలయాళ మాతృక అయిన “ఆర్డినరీ”కి రచయితగా పనిచేసిన మను “రైట్ రైట్” సినిమాకి దర్శకత్వం వహించాడు. ఉన్నది ఉన్నట్లుగా తీసేశాడు తప్పితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయలేదు. అందువల్ల అతడి దర్శకత్వ ప్రతిభ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేకుండా అయిపోయింది.
విశ్లేషణ:
మలయాళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులోనో లేక వేరే భాషలోనో రీమేక్ చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. అదే సమయంలో అక్కడ ఎందుకు హిట్ అయ్యింది అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కోసారి కేవలం కథ-కథనాలు మాత్రమే కాకుండా నేటివిటీ కారణంగానూ సినిమాలు హిట్ అయిపోతుంటాయి. “ఆర్డినరీ” పరిస్థితి కూడా అంతే. మలయాళ స్టార్ హీరో బిజూ మీనన్ నటించి ఉండడం, అక్కడి నేటివిటీని బాగా ప్రతిబింబించడం “ఆర్డినరీ” అక్కడ ఓ మోస్తరు విజయం సాధించడానికి కారణాలుగా నిలిచాయి.
ఇక్కడ.. అంటే తెలుగులో నేటివిటీ మిస్ అయ్యింది. అరకులో షూటింగ్ చేసేస్తే తెలుగు నేటివిటీ వచ్చేస్తుంది, జనాలు చూసేస్తారు అని అనుకోవడం దర్శకనిర్మాతల తెలివితక్కువతనానికి ప్రతీక.
ఇంతకుమించి ఏం చెప్పగలం.. కథలో కొత్తదనం ఇసుమంతైనా లేని, కథనంలో కనీస స్థాయి పట్టు కూడా లేని నాసిరకం సినిమా “రైట్ రైట్”.
మొత్తానికి..
ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా చూసినా చాలు అని అనుకొనేవారు కూడా చూడలేని “రైట్ రైట్” సినిమాని.. “నాకు అనంతమైన ఓపిక ఉంది” అనుకొనేవారు మాత్రమే ఒకసారి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి!