బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో ఒక సంచలనం అయింది. సుశాంత్ మృతిపై రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ జరిపారు. మరోవైపు సీబీఐ అధికారులు సైతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి సుశాంత్ గురించి చాలా విషయాలు చెప్పింది. తాను సుశాంత్‌తో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లినప్పుడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తాను గుర్తించానని రియా తెలిపింది. సుశాంత్‌కు విమాన ప్రయాణం అంటే భయం ఉండేదని, విచిత్రమైన బొమ్మలు, చిత్రాలు చూసినా సుశాంత్ వింతగా ప్రవర్తించేవాడని రియా తెలిపింది.
పారిస్ చేరుకున్నాక అతను మూడు రోజులు తన గదిని విడిచి రాలేదని, ట్రిప్‌కు ముందు సుశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపింది. యూరప్ వీధుల్లో తన చేయి పట్టుకొని సంతోషంగా తిరగాలని ఉందని చెప్పాడని, అక్కడ వారు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. సుశాంత్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మొడాఫినిల్ అనే మందులు తీసుకున్నాడని తెలిపింది. తాను 2013 లో రేష్‌శెట్టి అనే సైకాలజిస్ట్‌ను కలిసినట్లు.. అతనే మొడాఫినిల్ అనే మందును వాడమని సలహా ఇచ్చాడని నాకు తెలిపాడని రియా వెల్లడించింది.
తాను సుశాంత్ డబ్బులతో జీవించడం లేదని స్పష్టం చేసింది రియా. సుశాంత్ చాలా విలాసవంతమైన లైఫ్ గడిపేవాడని తెలిపింది. యూరప్ ట్రిప్‌లో హోటల్ ఖర్చులను సుశాంత్ చెల్లించినట్లు తెలిపింది. ఈ టూర్ కంటే ముందు సుశాంత్ తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లాడని, అక్కడ ఓ ప్రైవేటు జెట్ బుక్‌చేసుకుని దాదాపు రూ.70 లక్షలు ఖర్చుచేశాడని తెలిపింది. సుశాంత్ ఎలా బతకాలన్నది ఆయన నిర్ణయం మాత్రమే, నా వల్లే ఆయన విలాసాలు చేశాడన్నది పూర్తి అవాస్తవం అని రియా తెలిపింది. తన సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా సుశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాడని తెలిపింది. సుశాంత్, షోయిక్, నేను రియాలిటిక్స్ అనే సంస్థలో భాగస్వాములం. ఈ కంపెనీకి సుశాంత్ తన పేరు పెట్టాడని రియా తెలిపింది.