సుశాంత్ సింగ్ మరణం కేసులో ఓవైపు రోజుకో సంచలనాలు బయటపడుతుంటే మరో వైపు డ్రగ్ మాఫియాతో లింకులు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సుశాంత్ మృతి కేసు విచారణను సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. రియాతో ఇతరులకు ఉన్న సంబంధాల కోణంలో విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే నీరజ్ చెప్పిన డ్రగ్స్ వాడకం అంశం అనే తీగను లాగి బాలీవుడ్ డొంకను కదిలించే ప్రయత్నం చేస్తోంది. డ్రగ్ మాఫియాతో రియా చక్రవర్తి వాట్సప్ ఛాటింగ్ బయటకు వచ్చిన నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో డ్రగ్ మాఫియాతో బాలీవుడ్ హీరోలు, రాజకీయ నేతలకు లింకులపై ఇప్పుడు చర్చనీయాంశమైంది.
డ్రగ్ మాఫియాతో చాట్ విషయాల ఆధారంగా రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా చక్రవర్తిపై నార్కోటిక్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 20, 27, 29 ప్రకారం కేసు నమోదు చేసింది. త్వరలోనే రియా చక్రవర్తిని ఈ కేసులో విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతుంది. బాలీవుడ్‌లో కొంతమంది స్టార్లకు డ్రగ్స్ మాఫియాతో సంబంధముందనే విషయంపై అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు రాజకీయ నేతలతోపాటు మరికొందరికీ లింకులు ఉన్నట్టు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.