నయీమ్ కథను సినిమాగా తీస్తాడట!
మహమ్మద్ నయూముద్దీన్ అలియాస్ నయీమ్ నక్సలైట్ గా ఉండే ఈ వ్యక్తి పోలీస్ ఇంఫార్మర్ గా
మారాడు. అక్కడ నుండి గ్యాంగ్ స్టర్ గా మారి కొన్ని వందల కోట్లను సంపాదించాడు. నయీమ్
నేరాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రభుత్వం ‘ఆపరేషన్ నయీమ్’ పేరిట సీక్రెట్ గా ప్లాన్
చేసి పోలీసుల సహాకారంతో నయీమ్ ను మట్టుబట్టారు. ఇప్పుడు నయీమ్ కథను సినిమాగా
తీస్తానంటున్నాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రియల్ స్టోరీస్ ను తెరపై ఆవిష్కరించడంలో వర్మకు సెపరేట్ స్టయిల్ ఉంది. ఇప్పుడు నయీమ్ కథను కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ”నయూముద్దీన్ జీవితానికి సంబంధించిన వివారాలన్నింటినీ సేకరించాను. గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన నేరాలు, నక్సలైట్ నుండి పోలీస్ ఇంఫార్మర్ గా, అక్కడ నుండి అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ గా అతడి ప్రయాణం గురించి వివరించనున్నాను. కానీ ఒకే సినిమాలో ఇతడి కథను చెప్పడం అసాధ్యం. అందుకే ఈ కథను మూడు భాగాలుగా విభజించి చెప్పదలచుకున్నాను. గతంలో నేను రూపొందించిన ‘రక్తచరిత్ర’ సినిమాను రెండు భాగాలుగానే తీశాను. ఇప్పుడు నయీమ్ కథను మూడు భాగాలుగా రూపొందించనున్నాను” అని ట్వీట్ చేశారు.