ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.
సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని ఆర్జీవీ వెల్లడించారు. అందుకే సినిమా తీసిన నిర్మాత టిక్కెట్ ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గించిందని తాను భావించడం లేదని తెలిపారు. థియేటర్ల మూసివేత అంశం తనకు సంబంధించిన విషయం కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఒక నిర్మాతగానే తాను ఇక్కడికి వచ్చాన తాను ఎగ్జిబిట్లర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరఫున మంత్రి పేర్ని నానితో చర్చలకు రాలేదని ఆర్జీవీ వివరణ ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాల వాయిదాకు టిక్కెట్ ధరలే కారణం కావొచ్చని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. తాను ట్విట్టర్ లో పెట్టిన అన్ని ప్రశ్నలు మంత్రి పేర్ని నాని దగ్గర చెప్పానన్నారు. ఈ సమస్యకు కంక్లూజిన్ ఇచ్చే పవర్ తనకు లేదన్నారు.