వివాదస్పదర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 15న విడుదలైన మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలను వర్మ తీసుకున్నట్లు శేఖర్ రాజు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయానికి సంబంధించి తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు ఆర్జీవీ. నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘లడ్కీ’ చిత్రాన్ని నిలుపుదల చేశారని సీఐ హరీశ్ చంద్రారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జీవీ పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. శేఖర్ రాజు నాకే డబ్బు ఇవ్వాలి. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతో సినిమాను నిలిపివేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. నిర్మాత శేఖర్ రాజుకు నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సింది లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను. అని తెలిపారు.