దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు సహాయ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం విదేశాల నుంచి సైతం సహాయ సహకారాలు అందుతున్నాయి. విపత్తు సమయంలో సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సహాయం అందిస్తున్నారు. ఈ కోవలోనే నటి రేణు దేశాయ్ కూడా తన వంతు సాయం చేస్తానంటోంది.
సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడిన రేణూ దేశాయ్ కోవిడ్ బాధితులను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బారినపడిన వారికి ఆక్సిజన్ సిలిండర్లు, హాస్పిటల్ బెడ్స్, మందులు వంటివి అవసరమైన వారు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపితే తనవంతు సహాయం అందించడానికి కృషిచేస్తానన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. దయ చేసి స్పామ్, ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపించవద్దని ఆమె స్పష్టం చేసింది. నిజంగా అవసరం ఉన్న వాళ్లు పూర్తి వివరాలతో తనకు మెసేజ్ పంపితే తనక వీలైనంత సహాయం అందిస్తానన్నారు.