ప్రముఖ హీరోయిన్ రెజీనా.. తాను రాఖీ కడతానంటే అందరూ పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనకు సోదరులు ఎవరూ లేరని.. అందువల్లే రాఖీ పండుగను ఎప్పుడూ జరుపుకోలేదన్నారు. రెజీనా, అడవి శేషు, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ‘ఎవరు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో ప్రేక్షకులతో చిత్ర విశేషాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని తన పాత్ర విశేషాలతో పాటు తన సినీ అనుభూతులను పంచుకుంటూ.. రేడియో సిటీలో సందడి చేశారు. మన పాత్రకు వేరేవారు డబ్బింగ్ చెబితే భావాల్ని సరిగా వ్యక్తంచేయలేమని.. అదే మన పాత్రకు మనమే డబ్బింగ్ చెప్పుకుంటే ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుందన్నారు. ‘ఎవరు’ చిత్రంలో తొలిసారిగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని రెజీనా చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రమన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.