దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. గత 3 రోజులుగా భారత్‌లో రోజుకు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6767 కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా బయటపడినప్పటి నుంచి
ఇప్పటివరకు ఇదే అత్యధికం.
ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 1,31,868కి చేరింది. కరోనా బారినపడి నిన్న ఒక్కరోజే 147 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3867కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 54,441 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 73,560 మంది చికిత్సపొందుతున్నారు. మహారాష్ట్రలో 50,231 మంది కరోనా బారిన పడగా 1635 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కరోనా బాధితులు 16,277 మంది కాగా, మృతిచెందిన వారి సంఖ్య 103, గుజరాత్‌లో కరోనా బాధితులు 14,063 ఉండగా, 858 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 13,418 మంది కరోనా బాధితుల్లో 261 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ఇవాళ ఒక్కరోజే 29 మంది మృతిచెందారు.