తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ప్రాంతంపై కక్ష గట్టిందని రాయలసీమ ప్రాంత విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ “అరవింద సమేత” చిత్రంతో మళ్లీ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. “అరవింద సమేత” సినిమాలో పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలోని పలు ప్రజాసంఘాలు హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిరసన తెలిపాయి.
రాయలసీమపై చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్‌ను తొలగించాలని, దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతరంపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాటిని తొలగించని పక్షంలో రాయలసీమలో అరవింద సమేత సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించాయి.