బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, రవీనా టాండన్ జంటగా ‘పత్తర్ కే ఫూల్’, ‘అందాజ్ అప్నా అప్నా’ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులు. రవీనా గురించి సల్మాన్ ఎప్పుడు మాట్లాడినా ‘నాకు ఆమె 120 ఏళ్లుగా తెలుసు’ అని చెబుతుంటారట. ఈ విషయాన్ని రవీనా.. సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్ బలియే’ అనే డ్యాన్స్ రియాల్టీ షోలో వెల్లడించారు.
‘నేను తనకు 120 ఏళ్లుగా తెలుసని సల్మాన్ అందరితో చెబుతుంటాడు. సల్మాన్‌తో నాకున్న స్నేహం అలాంటిది. నచ్‌బలియే కార్యక్రమంలో సల్మాన్, నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు అసలు మేం సరిగ్గా మాట్లాడుకున్నట్లు కూడా చూపించలేదు. బహుశా నిడివి సరిపోనందుకు కట్ చేసుంటారు. 29 ఏళ్ల క్రితం మేమిద్దరం నటించిన ‘పత్తర్ కే ఫూల్’ సినిమా గురించే షోలో ఎక్కువగా మాట్లాడుకున్నాం. కానీ టీవీలో ఎపిసోడ్ చూశాక ఎందుకు ఎక్కువగా మాట్లాడేసుకున్నాం? అని ఒకర్నొకరం ప్రశ్నించుకున్నాం. అంతగా మాట్లాడకపోయి ఉంటే ఎపిసోడ్‌ను కట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు’ అని వెల్లడించారు రవీనా.