మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో ఈ రోజు ఏప్రిల్7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.
కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) లాయర్. ఈమె దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేస్తాడు రవీంద్ర (రవితేజ). రకరకాల వ్యక్తుల ముసుగులో హత్యలు చేస్తుంటాడు. తాను ముసుగుగా వాడుకున్న వ్యక్తులనే ఈ హత్యల్లో నేరస్తులుగా చిత్రీకరిస్తాడు. చిన్న ఆధారం కూడా వదలకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ ఈ హత్యలన్నీ రవీంద్ర ఎందుకు చేస్తున్నాడు? అస్సలు ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులను ఈ హత్యల్లో నేరస్తులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నాడు? అన్నదే కథాంశం.
థ్రిల్లర్ జోనర్ స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్న సుధీర్ వర్మ నుంచి వస్తున్న ఈ సినిమా. పైగా రవితేజ హీరోగా సినిమా కావడంతో కచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుధీర్ వర్మ ఒక మంచి కథాంశాన్ని ఎంపిక చేసుకున్నాడు. శ్రీకాంత్ విస్సా అందించిన కథలోని థ్రిల్లర్ జోనర్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి రవితేజ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మాస్‌గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మనం తరచూగా చూసే రవితేజను చూపించాడు దర్శకుడు. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి నెగిటివ్ షేడ్స్‌తో కూడిన రవితేజను పరిచయం చేశారు. రవితేజ హీరోగా ఇంత వయోలెంట్‌గా ఎప్పుడూ కనిపించలేదు.
అయితే, ఒక మంచి కథాంశాన్ని ఎంపిక చేసుకున్న సుధీర్ రవ్మ.. దాన్ని తెరపై ఎఫెక్టివ్‌గా చూపిండంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు అనే చెప్పాలి. భారీ నటీనటులతో తెరకెక్కించినా.. వారి టాలెంట్‌ని పెద్దగా వాడుకోలేదు. థ్రిల్లింగ్ సీన్స్ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండాఫ్ మొత్తం రవితేజ చేసే వయోలెన్స్ కొత్తగా అనిపిస్తుంది. సినిమాను కామెడీ, రొమాంటిక్ మూడ్‌తో మొదలుపెట్టిన దర్శకుడు.. క్రైమ్ సీన్‌తో అసలు కథలోకి తీసుకెళ్లారు. ఇక సాకేత్ (సుశాంత్) పాత్ర పరిచయంతో కథ మరో మలుపు తిరుగుతుంది. అయితే, ఈ లోపలే రెండు పాటలు కూడా అయిపోయాయి.
సుమారు 30 నిమిషాల పాటు సినిమా సాదాసీదాగానే సాగుతుంది. సాకేత్ పాత్ర పరిచయం తరవాత పోలీసుల ఇన్వెస్టిగేషన్.. హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని రివీల్ చేయడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే కచ్చితంగా ఆశ్చర్యంగానూ, భయానకంగానూ ఉంటుంది. హారికను రవీంద్ర చంపే సీన్ హైలైట్. అసలు ఆమెను అంత క్రూరంగా ఎందుకు చంపాడనే ఆలోచనతో ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ మొదలైనప్పటి నుంచీ థ్రిల్లర్ మొదలవుతుంది. రవీంద్ర ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు.. ఈ హత్యల్లో ఒక్కొక్కరిని ఎందుకు ఇరికిస్తున్నాడు వంటి విషయాలను రివీల్ చేశాడు దర్శకుడు.
ఈ టైమ్‌లోనే ‘రావణాసుర’ టైటిల్‌కు నిర్వచనం ఇచ్చారు. రామాయణంలో రావణాసురిడికి పది తలలు ఉంటే.. ఈ ‘రావణాసుర’ కు పది లక్ష్యాలు ఉన్నాయి. అయితే, తన పది లక్ష్యాలను ఛేదించడానికి రవీంద్ర ప్రోస్తటిక్ మేకప్‌ను వాడుకుంటాడు. ఈ మేకప్‌తో వేరే వ్యక్తుల్లా మారిపోయి హత్యలు చేస్తుంటాడు. నిజానికి మరో వ్యక్తుల్లా మాస్కులు వేసుకుని విలన్లను మోసం చేసిన హీరోల సినిమాలు గతంలో చాలానే చూశాం. ఎన్టీ రామారావు కాలం నుంచి ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ, అప్పటి సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు అస్సలు నమ్మశక్యంగా ఉండేవి కాదు. దాన్ని అధిగమించాలని దర్శకుడు సుధీర్ వర్మ ప్రోస్తటిక్ మేకప్‌తో హీరోని మరో వ్యక్తి రూపంలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఇది కూడా నమ్మశక్యం లేదు.
అందుకంటే.. ప్రోస్తటిక్ మేకప్‌తో మొహాన్ని మార్చేసినా బాడీ లాంగ్వేజ్ మార్చలేం కదా. ఇలాంటి మేకప్‌లో భయంకరమైన క్రైమ్‌లు చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం అంత సులభమా? దీనికి తోడు ఈ ప్రోస్తటిక్ మేకప్ కోసం వాడిన గ్రాఫిక్స్ కూడా అంతగా కుదరలేదు. రవీంద్ర ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ చాలా సింపుల్‌గా రివీల్ చేసేయడం కూడా అంత థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఒక క్రిమినల్ లాయర్ తన క్రిమినల్ బుర్రతో ఎలా ఆలోచించాడు, చట్టాన్ని వాడుకొని హత్యలు ఎలా చేశాడు అనే కాన్సెప్ట్‌తో క్లైమాక్స్ ఉంటుంది. ఇది కూడా అంత కిక్ ఇవ్వదు. ఒక హోం మినిస్టర్‌ను చంపడానికి ఈ లాజిక్ సరిపోదు అనిపిస్తుంది.
మొత్తంగా చూసుకుంటే లాజిక్ మిస్ అయిన ఒక కమర్షియల్ థ్రిల్లర్ ఈ మూవీ. లాజిక్కుల గురించి ఆలోచించని ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ, రొమాన్స్, ఇలా మొత్తం రవితేజానే నడిపించాడు. మొత్తనికి మాస్ మహారాజా వన్ మ్యాన్ షో ఇది. కానీ, ఈ సినిమాలో కొత్తదనం చూపించారు. తనలోని విలనిజాన్ని ప్రదర్శించారు. రావణాసుర టైటిల్‌కు న్యాయం చేశారు. సినిమాలో ఎంత మంది ఉన్నా మన కళ్లు రవీంద్ర పాత్ర చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర సాకేత్. ఈ పాత్రను సుశాంత్ పోషించారు. సుశాంత్‌లో నటుడికి పరీక్ష పెట్టేంత బలమైన పాత్రేమీ కాదు ఇది.
ఇక ఈ సినిమాలో ఐదుగురు అందమైన అమ్మాయిలు ఐదురకాల పాత్రలు పోషించారు. వీళ్లందరినీ హీరోయిన్లు అనడం కరెక్ట్ కాదు. ఐదు రకాల పాత్రల్లో నటించారంతే. ఇద్దరు హీరోయిన్లకు పాటల్లో రవితేజతో డాన్స్ వేసే ఛాన్స్ వచ్చింది. ఇంకొకరికి రొమాన్స్ చేసే అవకాశం దక్కింది. ఇంకో ఇద్దరికి రవితేజతో సంబంధమే లేదు. కానీ, ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఫరియా అబ్దుల్లా చేసిన కనకమహాలక్ష్మి పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్ ఓ మూడు సార్లు కనిపిస్తుంది. పూజిత పొన్నాడ, దక్ష పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. హైపర్ ఆది, హర్షవర్ధన్ పంచ్‌లు నవ్వు తెప్పిస్తాయి.
సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఏసీపీ హనుమంతరావు. ఈక్యారెక్టర్‌లో మలయాళ సీనియర్ నటుడు జయరాం నటించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి. ఇక జయప్రకాష్, సంపత్, శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, ప్రవీణ్, తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదనిపిస్తుంది. హర్షవర్థన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు పాటలు అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ, రెండు మూడు సన్నివేశాలు మినహా ఇది అలాంటి సినిమా లో లేవు.
టైటిల్ :రావణాసుర
నటీనటులు: రవితేజ,సుశాంత్,అను ఇమ్మాన్యుయేల్,మేఘా ఆకాశ్,ఫరియా అబ్దుల్లా,దక్షా నాగర్కర్,పూజిత పొన్నాడ,జయరాం.. తదితరులు
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ
చివరిగా: అక్కడక్కడ తప్ప పెద్ద ఆకట్టుకోని ‘రావణాసుర’
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు