టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైగర్’ ట్రైలర్ విడుదల గురువారం అట్టహాసంగా జరిగింది. తెలుగు ట్రైలర్ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయ్ దేవరకొండ.. సాయంత్రానికి ముంబై చేరుకున్నాడు. అక్కడ హిందీ వెర్షన్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రణవీర్ సింగ్ స్టెప్స్ వేసి అక్కడున్న వారిలో జోష్ పెంచే ప్రయత్నం చేయగా, ఆయనతోపాటు విజయ్ దేవరకొండ కూడా స్టెప్స్ వేశాడు. ఈ సమయంలో విజయ్ కాలికి హవాయి చెప్పల్స్ ధరించి కనిపించాడు. ఖాకీ రంగు ఖార్గో పాంట్, బ్లాక్ టీషర్ట్ తో డ్యాన్స్ చేశాడు. దీన్ని రణవీర్ సింగ్ గమనించాడు.
‘సోదరుడి స్టయిల్ చూడండి. చూస్తే నేను ఆయన ట్రైలర్ (లైగర్) కార్యక్రమానికి వచ్చినట్టు కాకుండా.. ఆయనే నా ట్రైలర్ విడుదలకు వచ్చినట్టుగా ఉంది’ అంటూ విజయ్ సింపుల్ స్టయిల్ ను రణవీర్ సింగ్ అభినందించాడు. పలు కార్యక్రమాల్లో చెప్పల్స్ తో కనిపించే జాన్ అబ్రహంతో విజయ్ ను పోల్చాడు. విజయ్ తో కలసి నటించిన అనన్య పాండే, సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని పిలవని రోజు కోసం చూస్తున్నాను. ఇది భారతీయ సినిమా, మనమంతా భారత నటులం. మనం చూడాల్సింది ఇదే’ అని వ్యాఖ్యానించాడు.