యువ నటుడు తనీష్ నటించిన తాజా చిత్రం ‘రంగు’. విజయవాడకు చెందిన లారా అనే రౌడీ షీటర్ జీవితాధారంగా ఈ సినిమాని కార్తికేయ తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో తనీష్ మాట్లాడారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ..’ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఓ ఎత్తు. ‘రంగు’ సినిమా మరో ఎత్తు. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ చిత్రం. ఈ సినిమా చూశాక మా అమ్మ ఏడ్చేసింది. చాలా మంచి సినిమా చేశావురా అని మెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆఖరి అరగంట పాటు వచ్చే సన్నివేశాలే ప్రధాన బలం. కచ్చితంగా ప్రేక్షకుడు చెమర్చిన కళ్లతో థియేటర్ నుంచి బయటకు వస్తాడని చెప్పగలను.
రౌడీషీటర్ లారా అనగానే అందరికీ అతనిపై నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడతాయి. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది. ఈ సినిమా తెరకెక్కించామని తెలిసి లారా కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని పిలిపించి మాట్లాడి సినిమా చూపించాం. ఓ రెండు సన్నివేశాల్లోని కొన్నిపదాలను మ్యూట్ చేయమని చెప్పారు. అందుకు దర్శకుడు కూడా ఒప్పుకొన్నారు. అంతేకాదు విజయవాడలో ఈ సినిమాను తామే ప్రచారం చేస్తామని చెప్పారు కూడా. లారా జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలు, పోలీసులు అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? తదితర విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మున్ముందు జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటానని మాటిస్తున్నాను. గతంలో చేసిన తప్పిదాలను చేయను’ అని తనీష్ వెల్లడించాడు.