బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్.. బిలియనీర్ ముకేశ్ అంబానీ తనకు ఇచ్చిన సలహా ఏంటో వెల్లడించాడు. గురువారం (ఫిబ్రవరి 15) రాత్రి ముంబైలో జరిగిన లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల వేడుకలో రణ్‌బీర్ చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ కు మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.
ఈ అవార్డు అందుకున్న తర్వాత రణ్‌బీర్ తన స్పీచ్ లో ముకేశ్ గురించి ప్రస్తావించాడు. ఆ సమయంలో ముకేశ్ అంబానీ అక్కడే ఉన్నారు. బాలీవుడ్ వెటరన్ నటుడు జితేంద్ర చేతుల మీదుగా అవార్డు అందుకున్న రణ్‌బీర్ మాట్లాడుతూ..
“నా జీవితంలో మూడు లక్ష్యాలు ఉన్నాయి. నా తొలి లక్ష్యం ఎంతో వినయంగా నా పని నేను చేసుకుంటూ వెళ్లడం. నేను ముకేశ్ భాయ్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. ఆయన నాతో ఎప్పుడూ చెబుతుంటారు. నీ తల దించుకొని పని చేసుకుంటూ వెళ్లు.. విజయాన్ని తలకెక్కించుకోకు.. ఓటమికి కుంగిపోకు అని చెబుతుంటారు” అని రణ్‌బీర్ అన్నాడు.
“నా రెండో లక్ష్యం ఓ మంచి మనిషిని కావాలని. ఓ మంచి కొడుకుగా, మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి సోదరుడిగా, స్నేహితుడిగా ఉండాలనుకుంటాను. మూడోది, అన్నింటి కంటే ముఖ్యమైనది.. నేను మంచి పౌరుడిగా ఉండాలనుకుంటాను. ముంబైయికర్ గా గర్వపడుతున్నాను. ఈ అవార్డులు నాకు చాలా విలువైనవి” అని రణ్‌బీర్ అన్నాడు.
ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీతో రణ్‌బీర్ కు మంచి పరిచయం ఉంది. అతనితో కలిసి అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు రణ్‌బీర్ జంట వెళ్లిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ గతేడాది డిసెంబర్ లో రష్మికతో కలిసి నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయనున్నాడు. ఈ సినిమా లవ్ అండ్ వార్ పేరుతో తెరకెక్కుతుంది. ఇందులో అతని భార్య ఆలియా కూడా నటిస్తోంది. ఇక ఇదే కాకుండా నితేష్ తివారీ రామాయణ మూవీలో రణ్‌బీర్ రాముడి పాత్ర పోషించబోతున్నాడు.