బాలీవుడ్ హీరో-హీరోయిన్‌లు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు మూళ్లు పడేవరకు ఈ జంట తమ వివాహ వేడుకపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంలో చాలా గొప్యత పాటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెళ్లయిన ఇన్ని రోజులకు వీరి మెహెందీ ఫంక్షన్ ఫొటోలు బయటకు వచ్చాయి.
ఎంతో సీక్రెట్‌గా కేవలం కొద్ది మంది సెలబ్రెటీలు, బంధుమిత్రుల మధ్య రణ్‌బీర్-ఆలియాల వివాహ వేడుకలు జరిగాయి. ఇక మెహెందీ ఫంక్షన్‌లో వీరిద్దరు గులాబీ రంగు దుస్తులు ధరించారు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో తెలికపాటి మహెందీతో ఆలియా చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోయింది. ఇక రణ్‌బీర్.. తన తల్లి నీతూ కపూర్, సోదరి రిద్ధిమా కపూర్‌లతో కలిసి ఉత్సహంగా డాన్స్ చేస్తూ కనిపించాడు. అలాగే తన తండ్రి, దివంగత నటుడు రిషి కపూర్ చిత్ర పటం పట్టుకుని కూడా డాన్స్ చేశాడు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని అతడు భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు.
ఆలియా పేరును తన చేతిపై మెహెందీగా వేయించుకున్నాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ ఫంక్షన్‌లో రణ్‌బీర్ కజిన్స్, హీరోయిన్లు కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లు, అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ నందా, ఆమె కూతురు నవ్వ నవేలీ నందాలతో పాటు తదితరులు సందడి చేశారు.