భారీ చిత్రాల దర్శకుడు శంకర్, రామ్చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ను ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దీంతో విశ్వంభర, సర్కారోడు, అధికారి అని ఇలా రోజుకో పుకారు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. శంకర్, రామ్చరణ్ మూవీకి సిటిజన్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషలకు సరిపోయేలా టైటిల్ ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. శంకర్, రామ్చరణ్ మూవీ తాజా షెడ్యూల్ జులై 1 నుంచి అమృత్సర్లో జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. అక్కడ 5 రోజుల పాటు షూటింగ్ అనంతరం తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఇంకా ఈ చిత్రంలో జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.