టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని 2020వ సంవత్సరం అందరిలాగే తనకి కూడా విభిన్నమైన అనుభూతులు సొంతం చేసిందని అన్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో.. 2020లో తన జీవితం ఏవిధంగా గడిచిందనే విషయాన్ని తాజాగా రామ్ వెల్లడించాడు. కరోనా కారణంగా ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో కొన్ని మంచివి. మరికొన్ని చెడ్డవి. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే నేను లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. కొన్నినెలలపాటు ఇంట్లోనే కూర్చొవడం కొన్నిసార్లు నాకెంతో చిరాకుగా అనిపించింది. అలాగే ఈ ఏడాది నా జీవితం అనుకున్నంత సాఫీగా జరగలేదు. ఎందుకంటే, మా కుటుంబం కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంది. నా సోదరుడు, అమ్మ కొవిడ్-19 బారినపడ్డారు. ఆ విషయం నన్ను ఎంతగానో బాధపెట్టింది, భయపెట్టింది. నా సోదరుడిలో కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువగానే కనిపించాయి. అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకి ఇంకా వ్యాక్సిన్ రానందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి’ అని రామ్ అన్నారు.