ఏపీలో సినిమా టికెట్ల అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీవర్గాలు కాస్త అసంతృప్తితో ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా ట్విటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి పలు ప్రశ్నలు సంధించారు. గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సార్’ అంటూనే సవాలు విసిరాడు. ‘నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వవలసిందిగా మిమ్మల్ని లేదా మీ ప్రతినిధులను సవినయంగా అభ్యర్థిస్తున్నాను’ అంటూ కౌంటర్లు వేసే ప్రయత్నం చేసారు వర్మ.
* సినిమాతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతమేరకు ఉంటుంది?
* గోధుమలు, బియ్యం, కిరోసిన్, వంటనూనె వంటి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయిస్తాయని తెలుసు. అయితే, అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది? సినిమా టికెట్ల ధరను ప్రభుత్వమే నిర్ణయించే విధంగా దారి తీసిన పరిస్థితులేంటి?
* పేదలకు సినిమా చాలా అవసరమని మీరు భావిస్తే.. విద్యా, వైద్యసేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకీ రాయితీ ఇవ్వొచ్చు కదా?
* పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్ షాపులు ఉన్నట్లే.. రేషన్ థియేటర్ల ఏర్పాటును పరిగణనలోకి తీసుకొని అటువంటి ఆలోచనలు చేస్తారా?
ఈ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సమాధానం ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘ఆహారధాన్యాల ధరలను బలవంతంగా తగ్గిస్తే రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. రైతులకు ప్రోత్సాహం లేకపోతే పంట నాణ్యతలో లోపం తలెత్తుతుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికీ వర్తిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యకు ‘ద్వంద్వ ధరల’ విధానం పరిష్కారంగా కనిపిస్తోంది. నిర్మాతలు వారు నిర్ణయించిన ధరకు టికెట్లను విక్రయిస్తారు. వాటిలో కొన్నింటిని ప్రభుత్వం కొనుగోలు చేసి తక్కువ ధరకు పేదలకు విక్రయించుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిర్మాతలకు డబ్బు.. మీకు ఓట్లు వస్తాయి’ అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. టికెట్ల ధరల విషయంపై సినీపరిశ్రమలోని వారందరూ తమ అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. ఇప్పుడు మాట్లాడకపోతే.. ఇంకెప్పుడూ మాట్లాడలేరని చెప్పారు.
ఆడమ్ స్మిత్ వంటి ఆర్థికవేత్తల మార్గదర్శక ఆర్థిక సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం పనిచేయదని ఆర్జీవీ స్పష్టం చేశారు. హీరోల రెమ్యూనరేషన్… వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, వచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుందని.. దీన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలని ఆర్జీవీ చెప్పారు. మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇవ్వడానికి అధికారం ఇచ్చారని.. మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు” అని పేర్కొన్నారు ఆర్జీవీ. సినీ పరిశ్రమలో ఇతర కొలీగ్స్ ఈ సమస్యపై అందరూ మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ నోళ్లు తెరవలేరు. తర్వాత మీ ఖర్మ అని మరో ట్వీట్ చేశారు.